
బిగ్‌బాస్ షో వివిధ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ రియాల్టీ షో అని తెలిసిందే. త్వరలో కన్నడ బిగ్‌బాస్-12 సీజన్ ప్రారంభం కానుంది. దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన హీరో సుదీప్ ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయాలనుకోవడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఈసారి ఎవరు హోస్ట్‌గా చేస్తారని కన్నడలో ఆసక్తి పెరిగింది. మళ్లీ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా రావాలని ఆయన అభిమానులు #KicchaBackOnBBK, #BiggBossKannada12 హ్యాష్‌ట్యాగ్స్‌తో వైరల్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకున్నారు. మళ్లీ హోస్ట్‌గా చేస్తానని ఆయన అధికారికంగా ప్రకటించారు.

బిగ్‌బాస్ హోస్ట్ విషయంలో కిచ్చా సుదీప్ తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ 'బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈమేరకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. కలర్స్ కన్నడ ఛానల్ 'బిగ్ బాస్' నిర్వాహకులు కిచ్చా సుదీస్‌తో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలిసింది. కిచ్చా సుదీప్ హోస్ట్‌గా ఒప్పుకోకుంటే తమకు వేరే ఆప్షన్లు లేవని నిర్వహాకులు అన్నారు. అందుకే ఆయన్ను ఒప్పించామని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, 12వ సీజన్ తర్వాత, 13వ సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్‌గా ఉంటానని ఆయన అన్నారు. తాము అలాంటి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు.
కన్నడ బిగ్‌బాస్ ఎందుకు చేయనని చెప్పానంటే..
మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్‌కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశానని ఆయన అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని చెప్పడంతోనే హోస్ట్‌గా చేసేందుకు ఒప్పుకున్నానని సుదీప్ అన్నారు.