
మహేశ్ విట్టా.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి... షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్గానూ ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. మంచి ఫేం అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా మాత్రం ఇంకా స్థిరపడలేదంటున్నాడు మహేశ్. ఇప్పటికీ ఆయనకంటూ సొంత ఇల్లు లేదట. తనకే కాదు తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఆస్తులేమి లేవని అంటున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహేశ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సినిమాలంటే పిచ్చి..
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఇంటర్ అయిపోగానే నేను సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పా. మా వాళ్లు..చదువు అంతా పూర్తయిన తర్వాత పంపిస్తా అన్నారు. దీంతో కడప ప్రొద్దుటూరులోనే డిగ్రీ పూర్తి, హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశా. ఒక ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి చెప్పి ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ కావాలని నా ఆశ. వచ్చిన మూడు నెలల్లోనే నాకు ఫన్ బకెట్ సిరీస్ చాన్స్ వచ్చింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. కానీ అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు యాక్టింగ్ చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. దీంతో ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ చేశా.
తినడానికి డబ్బులు లేకుంటే.. ఊరికనే ఆఫీస్‌కి వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్దం చెప్పేవాడిని. ఆయన అడిగితే మేడం పిలిచిందని చెప్పేవాడి. ఆయనే అర్థం చేసుకొని రూ. 50 జేబులో పెట్టి తిని రమ్మని చెప్పేవాడు. అలా నన్ను ఆరు నెలల పాటు చంటి పిల్లాడిలా కాపాడాడు.
ఇక్కడ లేదు.. ఊర్లో లేదు..
ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి ఫేం అయితే సంపాదించా కానీ డబ్బులు మాత్ర జమ చేయలేదు. ఇప్పటి వరకు నాకంటూ సొంత ఇల్లు లేదు. సిటీలోనే కాదు ఊర్లో కూడా నాకు ఇల్లు లేదు. మా ఫ్యామిలీ పేరున ప్రాపర్టీస్ కూడా లేవు. ఉన్నంతలో సంతోషంగా అయితే ఉన్నాం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కోటి రూపాయలు సంపాదిస్తే చాలు హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ కోటీ రూపాయలు జమ చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? పైగా ఇక్కడ చాలా వరకు డబ్బులు రావు. చాలామంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. డబ్బులు ఇవ్వమని ముఖంపైనే చెప్పేవాళ్లు. కొంతమంది అకౌంట్లో వేస్తామని చెప్పి.. వేయరు. గట్టిగా అడుగుదామంటే.. మిగతావాళ్లకు ఎక్కడ తప్పుగా చెప్పి అవకాశాలు రాకుండా చేస్తారోననే భయం. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులది ఇదే పరిస్థితి’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు.