'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్‌!  | Sakshi
Sakshi News home page

Bhola Shankar Meher Ramesh: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్‌! 

Published Wed, Aug 9 2023 12:40 AM

Bhola Shankar releasing on 11th August 2023 - Sakshi

‘‘షాడో’ సినిమా తర్వాత దర్శకుడిగా నాకు కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ గ్యాప్‌లో నేను కొన్ని కథలు రెడీ చేసుకున్నాను. ఇక అన్నయ్య (చిరంజీవి) సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చాక నా కమ్‌బ్యాక్‌ సినిమా ఆయనతో చేయాలనుకున్నాను. అందుకే షాడోలో వున్న నాపై మెగా లైట్‌ పడిందని ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్‌లో చెప్పాను’’ అన్నారు దర్శకుడు మెహర్‌ రమేష్‌.

చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ చెప్పిన విశేషాలు. 

∙‘భోళా శంకర్‌’ సినిమాకు దర్శకుడిగా చేసి, అన్నయ్య ప్రశంసలు అందుకోవడాన్ని పెద్ద అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నాను. ఇక దర్శకుడిగా నాకు లభించేది అంతా బోనస్‌గా ఫీలవుతాను. అన్నయ్య, నేను కజిన్స్‌. సో.. సెట్స్‌లో ఆయన నన్ను ఏరా అని చనువుగా పిలిచేవారు. ∙తరాలు మారినా అనుబంధాలు మారలేదు. ‘వేదాళం’ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నాకు బాగా నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్న ఈ తరహా సబ్జెక్ట్‌ని నేనిప్పటివరకూ డీల్‌ చేయలేదు. తమిళ ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ చేశాం. గతంలో నా దర్శకత్వంలో కొన్ని రీమేక్స్‌ వచ్చాయి.

సాధారణంగా నేను రీమేక్‌ రిస్క్‌ అనుకోను. ఓ టాస్క్‌గా తీసుకుంటాను. వాటికి నా ట్రీట్‌మెంట్‌ వేరుగా ఉంటుంది. ‘భోళా శంకర్‌’లో 60 నుంచి 70 శాతం మార్పులు చేశాం. పెద్ద సక్సెస్‌ అయిన సినిమాను కరెక్ట్‌గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. ‘భోళా శంకర్‌’ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజెంట్‌ చేశాం. ∙ఈ చిత్రంలో చెల్లెలి పాత్రకు కీర్తీ సురేష్‌గారు ఒప్పుకుంటారని అనుకోలేదు. స్వప్న దత్‌ ద్వారా కీర్తీని అ్రపోచ్‌ అయ్యాను.

కథ విని ఆమె ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ పాత్ర ఆ సినిమాకు బిగ్‌ ఎస్సెట్‌. అలా ‘భోళా శంకర్‌’లో కీర్తీ సురేష్‌ రోల్‌ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. మణిశర్మగారి కుమారుడు మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. ఇక అనిల్‌ సుంకరగారు ఫ్యాషనేట్‌ అండ్‌ పాజిటివ్‌ ప్రోడ్యూసర్‌. నా తర్వాతి చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తాను. 

 
Advertisement
 
Advertisement