
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్‌ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.
ఢికొట్టి..ఆపై పారిపోయి..
ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది.

నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి.