సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు

AP Minister Perni Nani Pays Tributes To Sirinvennela Sitaramashastry - Sakshi

హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: అక్షర యోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు సాయివెంకటయోగేశ్వరశర్మ తండ్రి చితికి నిప్పంటించారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానానికి సిరివెన్నెల అంతిమయాత్ర మొదలైంది.

అభిమానులు సిరివెన్నెల పాటల్ని తలచుకుంటూ ఆ వాహనం వెంట సాగారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో వేద పండితులు అంత్యక్రియల ప్రక్రియను పూర్తిచేయించారు. సిరివెన్నెలకు నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు పేర్ని నాని, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ఆయన్ని కోల్పోవడం యావత్‌ తెలుగు ప్రజలకు బాధాకరమని పేర్కొన్నారు. సిరివెన్నెలతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుని నేపథ్యగాయకుడు మనో, మరికొందరు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు నిర్మాత సురేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నటులు బ్రహ్మనందం, రఘుబాబు, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు. 
.
సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడమేగాక ఆస్పత్రి ఖర్చులను భరిస్తుండటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మంగళవారం ఉదయమే మాకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, ఆస్పత్రి ఖర్చులు భరిస్తామన్న విషయాన్ని తెలపాలని సీఎం జగన్‌ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు సిరివెన్నెల మంగళవారం కన్నుమూశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ తమ సంతాపాన్ని ప్రకటించారు. అంత్యక్రియలకు ఏపీ సమాచారశాఖ మంత్రి హాజరయ్యారు. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేం కట్టిన అడ్వాన్స్‌ కూడా తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం..’ అని సిరివెన్నెల పెద్ద కుమారుడు సాయియోగేశ్వరశర్మ, ఇతర కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి
– అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం
ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా జగన్‌ ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆ కుటుంబంపై పడకుండా చూడాలన్న సీఎం జగన్‌ సూచనల మేరకు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి, మొత్తం ఖర్చులను సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top