
కశ్మీర్ ఫైల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. నటనతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్షన్లో వచ్చిన తన్వి ది గ్కేట్ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. కాగా.. అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'తన్వి ది గ్రేట్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. ఇది కాస్తా సిల్లీగా అనిపించినా ఆయనకు మాత్రం పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. టాయిలెట్ ప్రదేశాల్లో బయట ఉండే ఆడ, మగ గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయ్యానని ఏకంగా వీడియోను పంచుకున్నారు. ఇలా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని ఫ్యాన్స్ను అడిగారు. టాయిలెట్ బయట సింపుల్గా లేడీస్, జెంట్స్ అని రాస్తే సరిపోతుంది కదా? ఈ బొమ్మలు వేసి ఎందుకింత అయోమయానికి గురి చేస్తున్నారని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో నాకు అర్థం కాని విషయం.. గతంలో ఉన్నంత సరళంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
ఇదంతా ఫన్నీగా అనిపించినా వయస్సు పెరిగే కొద్ది చూపు కూడా తగ్గుతుంది. బహుశా అందువల్లే గుర్తు పట్టలేక తన బాధను ఇలా అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా అందరూ సులభంగా గుర్తు పట్టేలా బొమ్మలతో పాటు పేర్లు కూడా రాస్తే సులభంగా ఉంటుందని నెటిజన్స్ సలహాలిస్తున్నారు.
కాగా.. అనుపమ్ దర్శకత్వం వహించిన తన్వీ ది గ్రేట్ చిత్రం ఆటిజంతో బాధపడుతున్న ఓ యువతి తండ్రి స్ఫూర్తిలో భారత సైన్యంలో చేరాలని కలలు కంటుంది. ఆ యువతి స్ఫూర్తిదాయకమైన కథనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్‌తో పాటు శుభంగి దత్, బోమన్ ఇరానీ, కరణ్ ట్యాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అనుపమ్ ఖేర్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించిన 'తన్వి ది గ్రేట్' కేన్స్, న్యూయార్క్, హ్యూస్టన్, లండన్‌లో జరిగిన చలనచిత్రోత్సవాలలో అంతర్జాతీయంగానూ గుర్తింపును తెచ్చుకుంది.