
సంగీత దర్శకుడిగా దక్షిణాదిని దున్నేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ , జైలర్–2 చిత్రంతో పాటు కింగ్డమ్ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కింగ్డమ్, కూలీ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్లాయి. రాక్‌స్టార్ అనిరుధ్ మరో పక్క సంగీత కచేరీలతోనూ దుమ్ము రేపుతున్నారు. ఈయన ఇప్పటికే పలు దేశాలలో హుకుమ్ చెన్నై ఇసై(సంగీతం) పేరుతో సంగీత కచేరీలను నిర్వహించారు.
ఫైనల్‌గా ఆగస్టు 23వ తేదీన చెన్నైలో సంగీత కచేరీని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనిరుధ్ జైలర్ చిత్రంలో రజనీకాంత్ చెప్పిన హుకుమ్ అనే డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అదే పేరుతో అనిరుధ్ హుకుమ్ చెన్నై ఇసై పేరుతో సంగీత కచేరీలను నిర్వహిస్తున్నారు. చెన్నై అభిమానుల కోరిక మేరకు ఇప్పుడు స్థానిక సముద్ర తీరంలోని కూవంరూర్ ప్రాంతంలో ఉన్న మార్గ్ స్వర్ణభూమి ప్రాంతంలో భారీ ఎత్తున సంగీత కచేరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇది ఇంత వరకూ చెన్నై సంగీత ప్రియులు కనీవినీ ఎరుగనటువంటి రీతిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంగీత కచేరీకి సంబంధించిన పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయని అనిరుధ్ తెలిపారు. అదే విధంగా ఆగస్టు 4వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.