మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్‌బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్‌తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అమిర్‌పేట్‌లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్‌లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం.
ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్‌తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.


