
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్‌తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్‌ని కలిశాడని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్‌తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం.