టాలీవుడ్‌లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు.
నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.
ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


