‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అంటే... లోకేశ్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా, బాసిల్ జోసెఫ్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ అవకాశాన్ని లోకేశ్ కనగరాజ్ అందుకున్నారు. అల్లు అర్జున్ నటించనున్న ‘ఏఏ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బన్నీ వాసు, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరించ నున్న ఈ మూవీని బుధవారం ప్రకటించారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతున్న ‘ఏఏ 23’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది. అల్లు అర్జున్‌ని ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించనున్నారు లోకేశ్ కనగరాజ్. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఆగస్టులో ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


