
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.
ఆలియా భట్ తన నోట్‌లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.
కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్‌పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్‌కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు.