Alia Bhatt Darlings Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Darlings Movie Review: భర్త పెట్టిన టార్చర్‌కు ప్రతీకారమే డార్లింగ్స్‌..

Published Sun, Aug 7 2022 4:50 PM

Alia Bhatt Darlings Movie Review In Telugu - Sakshi

ఆ హక్కు ఎవరిచ్చారు? ఆడవాళ్ల మీద జరిగే దౌర్జన్యాలకు సినిమా వినోదకరమైన సమాధానాలు వెతుకుతూనే ఉంటుంది. ఆఫీసుల్లో జరిగే లైంగిక వేధింపులకు జవాబుగా గతంలో కమలహాసన్‌ ‘ఆడవాళ్లకు మాత్రమే’ తీశాడు. అందులో బాస్‌ను గెస్ట్‌ హౌస్‌లో బంధించి ప్రతీకారం తీర్చుకుంటారు మహిళా ఉద్యోగులు. ఇప్పుడు ఆలియా భట్‌ నటించిన ‘డార్లింగ్స్‌’లో గృహహింసకు పాల్పడే భర్తను ఇంట్లోనే కిడ్నాప్‌ చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది భార్య. ఆగ్రహాన్ని చూపే హక్కు స్త్రీలకు ఉన్నా హింసకు హింస జవాబు కాదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇదంతా కళ్లకు కట్టే సినిమానే ‘డార్లింగ్స్‌’.

అదొక రెడిమేడ్‌ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ. కుట్టేవాళ్లంతా స్త్రీలు. మేనేజర్‌ పురుషుడు. ఆ పురుషుడు హుందా ప్రవర్తన ఉన్నవాడైతే ఏ సమస్యా లేదు. వంకర బుద్ధి ఉన్నవాడైతే? 1994లో వచ్చిన ‘మగలిర్‌ మట్టుం’ (తెలుగు డబ్బింగ్‌: ఆడవాళ్లకు మాత్రమే) ఈ సమస్య నే చర్చిస్తుంది. హాలీవుడ్‌ సినిమా ‘9 టు 5’ చూసి ఈ కథను తయారు చేయించిన కమలహాసన్‌ స్వయంగా నిర్మించి సింగీతం శ్రీనివాసరావుతో డైరెక్ట్‌ చేయించాడు.

ఏమిటి శిక్ష?...
గార్మెంట్స్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ అయిన నాజర్‌ చీటికి మాటికి కేబిన్‌లోకి వర్కర్లను పిలిచి వారిని తాకే ప్రయత్నం చేస్తుంటాడు. మాటలతో అసభ్యసంకేతాలు పంపుతుంటాడు. అతని కేబిన్‌లోకి వెళ్లడానికే భయపడి చస్తుంటారు మహిళా ఉద్యోగులు. వారు ఉద్యోగాలు మానలేరు– ఇళ్లల్లోని పరిస్థితుల వల్ల. ఇతని నుంచి తప్పించుకోలేరు. ఆ సమయంలో ముగ్గురు మహిళా ఉద్యోగులు (రేవతి, రోహిణి, ఊర్వశి) కలిసి ‘ఈ మేనేజర్‌ వెధవకు బుద్ధి చెబుదాం’ అనుకుని కిడ్నాప్‌ చేస్తారు. ఊరికి దూరంగా ఒక గెస్ట్‌హౌస్‌లో పెట్టి నరకం చూపిస్తారు. వారు పడ్డ హింసకు అదొక ప్రతీకారం. కాని ఇదంతా ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళంలో 175 రోజులు ఆడింది. ‘మీటూ’ మూవ్‌మెంట్‌ ఇప్పుడు వచ్చింది. కాని దక్షిణాది సినిమాల్లో తొలి మీటూ మూవ్‌మెంట్‌గా ఈ సినిమాను ఇప్పటికీ చెబుతారు. అయితే ఇప్పుడు ఇదే కథ ఇంకో పద్ధతిలో రిపీట్‌ అయ్యింది.

కంటికి కన్ను పంటికి పన్ను...
ముంబైలో ఆమె అందరిలాంటి గృహిణి. భర్త అందరిలాంటి భర్త కాదు. పురుషుడనే అహంకారం. పోషిస్తున్నాననే పొగరు. పెళ్లయ్యి మూడేళ్లే అయి ఉంటుంది.  భార్యను చావ చితక బాదుతాడు. తాగొచ్చి నరకం చూపిస్తాడు. చుట్టుపక్కల వాళ్లు ఆమె ఏడుపు వింటూ ఉంటారు. కానీ మనకెందుకు అని ఊరుకుంటూ ఉంటారు. ఒకరోజు దీనంతటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆమె నిశ్చయించుకుంటుంది. తల్లితో కలిసి పక్కా ప్లాన్‌ వేస్తుంది. భర్తను ఇంట్లోనే కిడ్నాప్‌ చేస్తుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇస్తుంది. ఇంట్లోనే ఉన్న భర్తను పోలీసులు ఊరంతా వెతుకుతుంటే తల్లితో కలిసి భర్తను– తనను ఎలాగైతే చిత్రహింసలు పెట్టాడో అలాగే హింసలు పెట్టడం మొదలెడుతుంది ఆమె. ఇది ఆలియా భట్‌ నటించిన తాజా సినిమా ‘డార్లింగ్స్‌’ కథ.

దీనిలో ఆలియా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించింది. గౌరీ ఖాన్, షారుక్‌ ఖాన్‌లు కూడా ఒక చేయి వేశారు. సినిమాకు దర్శకత్వం వహించింది మహిళా దర్శకురాలు జస్మిత్‌ కె.రీన్‌. సినిమా అంతా బ్లాక్‌ కామెడీగా ఉంటుంది. ‘స్త్రీలపై హింస ఏ విధంగా చూసినా సమర్థించేది కాదు. మగవారికి ఆ హింస తెలిస్తే తప్ప అదెంత భయంకరంగా ఉంటుందో అర్థం కాదు’ అనే మెసేజ్‌ను క్యారీ చేయడానికే ఈ సినిమా ఆమె తీసింది. ఆలియా, షెఫాలీ షా, విజయ్‌ వర్మ వంటి గొప్ప నటీనటులు ఇందులో యాక్ట్‌ చేశారు.

తిరగబడుతున్న మగవారు...
స్త్రీలపై హింసకు కారణం మగవారు. కాని ఈ సినిమాను వారు విమర్శిస్తున్నారు. ‘హింస స్త్రీల మీద జరిగినా పురుషుల మీద జరిగినా హింసే. భర్త భార్యను కొట్టడం ఎంత తప్పో భార్య భర్తను కొట్టడం అంతే తప్పు. మగవాడిపై చేసే హింసను వినోదంగా చూపిన ఈ సినిమాను బహిష్కరించండి’ అని ట్విట్టర్‌ లో ఉద్యమం కూడా నడిపారు. 

మారేదెప్పుడు?... నిజమే. హింసకు హింస సమాధానం కాదు. కాని స్త్రీలు ఈ స్థాయిలో విసిగిపోయేంతగా తండ్రి, భర్త, కొడుకు, సోదరుడు స్త్రీను హింసించడం లేదా? వారికి గౌరవం ఇస్తున్నారా? వారి మాటకు విలువ ఇస్తున్నారా? వారిపై చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారు? మొగుడికి కొట్టే హక్కు ఉంది అనే భావజాలం సజీవంగా ఎవరు ఉంచారు.. ఇవి ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు. భార్యలు భర్తలను హత్య చేసే వార్తలు కూడా చూస్తున్నాం. అసలు భార్యలతో స్నేహంగా ఉంటూ వారితో సంభాషణ నెరుపుతూ వారికి ఏం కావాలో ఏం వద్దో పట్టించుకునే తీరిక మగవాడు చూపుతున్నాడా? చేసుకుంటున్నాడా? అది ముఖ్యం.

అంత వరకూ ‘డార్లింగ్స్‌’ వంటి సినిమాలు వస్తే వ్యతిరేకించే హక్కు మగవారికి ఉండకపోవచ్చు. వేలు తెగితే అది స్త్రీదైనా పురుషుడిదైనా రక్తమే వస్తుంది. స్త్రీ వేలు ముఖ్యంగా పెళ్లాం వేలు రక్తం వచ్చేలా కొరకొచ్చు అనుకుంటే స్త్రీలు ఎల్లకాలం ఊరికే ఉండరు అని హెచ్చరిక చేస్తున్న సినిమా ‘డార్లింగ్స్‌’.

చదవండి:  ప్రియుడి ఇంట్లో అత్తతో కలిసి పూజ చేసిన జోర్దార్‌ సుజాత!
ఆమిర్‌ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా..

Advertisement
 
Advertisement
 
Advertisement