అందుకే అక్షయ్‌తో బ్రేకప్ ‌తప్పలేదు: రవీనా

Akshay kumar And Raveena Tandon Love Story In Telugu - Sakshi

రవీనా టండన్, అక్షయ్‌ కుమార్‌..  ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితమే.. రవీనా తెలుగు సినిమాల్లో నటించి.. అక్షయ్‌ తనకు నచ్చిన కొన్ని తెలుగు సినిమాలను హిందీలో పునర్నిర్మించి! పెళ్లితో ‘ఫ్యామిలీ మన్‌’గా పేరు తెచ్చుకున్న అక్షయ్‌ పెళ్లికాక ముందు ప్రేమ విషయంలో మాత్రం  ఖిలాడీ అనే ముద్రను మోశాడు. అతను ప్రేమించిన వాళ్ల జాబితా రవీనా నుంచి మొదలవుతుంది.. ఆ విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’..

రవీనా, అక్షయ్‌ కుమార్‌.. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ‘మొహ్రా’ సినిమా సెట్స్‌లో. రవీనా బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌నెస్‌కి ఫిదా అయ్యాడు అక్షయ్‌. ఉరకలేసే అతని ఉత్సాహానికి మనసిచ్చేసింది రవీనా. ఆ ప్రేమను రహస్యంగా ఉంచలేదు ఆ జంట. బాలీవుడ్‌లో ఏ ఫంక్షన్‌ జరిగినా కలిసే వెళ్లేవారు. ‘ఇద్దరూ పంజాబీలే. ఈడుజోడూ బాగుంది’ అని వాళ్లను చూసి ముచ్చట పడింది బాలీవుడ్‌ ఇండస్ట్రీ. ‘పెళ్లి కబురు చెప్తారు’ అనీ ఎదురు చూడసాగింది. పరిశ్రమ అనుకున్న ట్టుగా రవీనా కూడా మానసికంగా పెళ్లికి సిద్ధ పడింది. కొత్త సినిమాలేవీ అంగీకరించకుండా. ఎందుకంటే అక్షయ్‌.. తనను  గృహిణిగానే ఉండాలని కోరుకున్నాడని. ‘మన పెళ్లయ్యాక  నువ్వు సినిమాలు చేయొద్దు. ఇప్పుడు చేస్తున్న సినిమా ఆఖరి రోజు షూటింగ్‌ అయిపోగానే పెళ్లి చేసుకుందాం’  అని రవీనాకు చెప్పి నిశ్చితార్థానికి ముహూర్తమూ ఖరారు చేయించాడు అక్షయ్‌కుమార్‌.  

నిశ్చితార్థం..
ముంబైలోని ఒక ఆలయంలో నిశ్చితార్థపు సన్నాహాలు జరిగాయి. అక్షయ్‌ ఢిల్లీలో ఉంటున్న తన తల్లిదండ్రులను ఆగమేఘాల మీద ముంబైకి రప్పించాడు. రవీనా కూడా వాళ్ల అమ్మానాన్నను పిలిచింది. ‘శాస్త్రోకంగా జరిగింది మా ఎంగేజ్‌మెంట్‌. అక్షయ్‌ వాళ్ల పెద్దవాళ్లు వచ్చీరావడంతోనే నాకు ఎరుపు రంగు దుపట్టా పెట్టారు. బహుశా వాళ్లు అక్కడ జరగబోయేది పెళ్లని అపోహపడి ఉంటారు’ అని చెప్పింది రవీనా వాళ్ల బ్రేకప్‌ తర్వాత ఎప్పుడో స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నిశ్చితార్థం అయిపోయింది... రవీనా కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. అయినా పెళ్లి పనులు ముందుకు సాగలేదు. పైగా తమకు నిశ్చితార్థం అయినట్టు ఎక్కడా చెప్పకూడదని రవీనాను కట్టడి చేశాడు అక్షయ్‌. అప్పటికే అతనికి విపరీతమైన మహిళా అభిమానగణం ఉండడం, అక్షయ్‌ ఎంగేజ్‌మెంట్‌ విషయం బయటకు వస్తే ఆ అభిమానులు దూరమవుతారేమో, అది తన కెరీర్‌ మీద ప్రభావం చూపిస్తుందేమోననే  భయంతోనే ఆ నిజాన్ని దాచిపెట్టమన్నాడు అంటుంది రవీనా. 

పెళ్లి ఎందుకు జరగలేదు...
ఈలోపే అక్షయ్‌ ‘ఖిలాడియోంకా ఖిలాడీ’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. అందులో నటిస్తున్న రేఖతో అతను దగ్గరగా మెదులుతున్నాడన్న వదంతులు మొదలయ్యాయి. అవి రవీనా దాకా వచ్చాయి. అక్షయ్‌ను అడిగింది. అలాంటిదేం లేదు అన్నాడు. రేఖ కాకపోతే ఇంకో అమ్మాయి.. ఇంకో అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి.. అలా అక్షయ్‌కు సంబంధించి ఏదో ఒక నటితో వార్తలు రవీనాకు వినిపిస్తూనే ఉన్నాయి. చిరాకేసింది ఆమెకు. అయినా పెళ్లి వంకతో ఎన్నాళ్లని తనలా ఇంట్లో ఉండాలి? అని అసహనపడింది. పరిష్కారంగా తనకు వస్తున్న సినిమా అవకాశాలను అంగీకరించడం ప్రారంభించింది. రవీనా తీరు అక్షయ్‌లో కలవరం పుట్టించింది. ఆమె దగ్గరకు వెళ్లి ‘వద్దు... సినిమాలు ఒప్పుకోవద్దు.. పెళ్లి చేసుకుందాం’ అని బతిమాలాడు.

‘ఒకసారి నీ కోసం సినిమాలు వద్దనుకున్నాను. కాని ఇప్పుడు నా చాయిస్‌ సినిమానే’ అని స్పష్టం చేసింది రవీనా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు.. అంటూ వెంటపడ్డాడు. మూడేళ్లు అవకాశం ఇచ్చింది. ఈసారి అతనితో శిల్పాశెట్టి పేరు జతకూడింది. శిల్పాశెట్టికి, రవీనాకు మంచి స్నేహం ఉంది. ఆ పేరు తన చెవిన పడగానే ఇక అక్షయ్‌తో అనుబంధం తెంచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆచరణలో పెట్టింది.  ‘అక్షయ్‌... తనకు పరిచయమున్న ప్రతి ఇద్దరమ్మాయిల్లో ఒకరికి ప్రేమను పంచుతాడు. ఏ రిలేషన్‌కైనా లాయల్టీ ముఖ్యమనుకుంటాన్నేను. అలాంటి పట్టింపులేమీలేని వాడు అతను. తను తప్పు చేసినప్పుడల్లా నేను క్షమించేసేయాలని అనుకునేవాడు. అలాగే చేశాను కూడా మూడేళ్లు. కాని భవిష్యత్తూ అలాగే కొనసాగనుందని తెలిసీ ఎలా ముందుకు సాగుతాం? అందుకే బ్రేకప్‌తప్పలేదు’ అని చెప్పింది రవీనా స్టార్‌డస్ట్‌ ఇంటర్వ్యూలోనే. 
∙ఎస్సార్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top