
నటుడు ధనుష్ ఇప్పుడు నటనతో పాటూ దర్శకత్వం పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన ఇటీవల వరుసగా మూడు చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషం. అందులో ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా కొత్త తారలతో నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోపం అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రానికీ దర్శక ,నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తాజాగా కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. ఇందులో నటి నిత్యామీనన్ నాయికిగా నటించారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. కాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న మరో ద్విభాషా చిత్రం కుబేర.
ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తున్నారు. కాగా త్వరలో డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించే చిత్రంలో కథానాయకుడుగా నటించరనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి అజిత్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంది. దీని గురించి డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాష్ భాస్కరన్ ధృవపరిచారు. ఆయన ఓ భేటీలో పేర్కొంటూ తాను త్వరలో ధనుష్ కథానాయకుడిగా చిత్రం నిర్మించనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా అజిత్ హీరోగా ధనుష్ దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని, అజిత్ కోసం ధనుష్ కథను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే అజిత్‌ను కలిసి కథను వినిపించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే తాను భావిస్తున్నట్లు నిర్మాత ఆకాష్ భాస్కర్ పేర్కొన్నారు. ఇకపోతే అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈయన నటించే తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో ధనుష్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపుతారా అన్న ఆసక్తి కూడా నెలకొంది.