మా నాన్న అలాంటి వారు కాదన్న ఐశ్వర్య.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్‌ | Aishwarya Rajinikanth Emotional Comments On Rajinikanth, Says My Dad Is Not A Sanghi - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth: మా నాన్న అలాంటి వారు కాదన్న ఐశ్వర్య.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్‌

Published Sat, Jan 27 2024 12:00 PM

Aishwarya Rajinikanth Emotional Comments On Rajinikanth - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సెలందర్య, మనవళ్లు యాత్ర, లింగ పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకులు నెల్సన్, కేఎస్ రవికుమార్, నిర్మాత కలైపులి ఎస్ థాను సహా ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 

లాల్ సలామ్ చిత్రానికి దర్శకురాలు అయిన ఐశ్వర్య రజనీకాంత్ తన తండ్రి గురించి, సినీరంగంలో తనకు ఎదురవుతున్న సవాళ్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. 'మా నాన్నగారు 35 ఏళ్లుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు. ఈ సినిమా కథ నచ్చడంతో లాల్ సలామ్‌లో నటించడానికి ఆయన అంగీకరించారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన నా కోసం ఈ చిత్రంలో నటించలేదు. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్‌ను నమ్మి రజనీకాంత్‌, సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వారిద్దరు కలిసి ఉన్న ప్రాజెక్ట్‌లో పనిచేయడం మా అందరికి గొప్ప వరం.

ఒక స్టార్‌కు అమ్మాయి అని గుర్తింపు ఉంటే చాలు ఇక్కడ ఎవరూ సినిమా అవకాశం ఇవ్వరు. చిత్ర పరిశ్రమలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ, వారు మీకు సినిమా ఛాన్స్‌ ఇవ్వరు. కారణం ఎంటో నాకు తెలియదు. కొత్తవారికే ఛాన్సులు ఇస్తారు కానీ మాకు సినిమా అవకాశం ఇవ్వరు. ఆ విషయం చిత్రపరిశ్రమలో ఉన్నవారికే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అవాంతరాలు వచ్చినా ముందుకు సాగాం. ఈ క్రమంలో  దాదాపు 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. వారి పాఠశాలలో సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయినా వారు నన్ను సపోర్ట్ చేస్తారు. నా పిల్లలే నా గొప్ప బహుమతి.' అని ఐశ్వర్య తెలిపింది. 

నాన్న అలాంటి వారు కాదు: ఐశ్వర్య
సోషల్‌మీడియా వేదికగా తన నాన్నగారిపైన చాలా నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఐశ్వర్య బాధపడింది. ' నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి నా టీమ్‌ ద్వారా తెలుసుకున్నాను. ఒక్కోసారి అలాంటి వాటిపై చాలా కోపం వస్తుంది. మేము కూడా మనుషులమే కదా.. మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. చాలా మంది నా తండ్రిని సంఘీ (మతవాది) అంటూ ప్రచారం చేస్తుంటే బాధేస్తుంది. దానికి అర్థం కూడా నాకు తెలియదు. ఒక మతానికి మద్దతు ఇచ్చేవారిని సంఘీ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. దీంతో ఆయనపై చెడుగా వ్యాప్తి చేశారు. రజనీకాంత్‌ ఎప్పటికీ సంఘీ కాదు.. ఆయన అలాంటి వారే అయితే లాల్‌ సలామ్‌ చిత్రంలో నటించే వారే కాదు.' అని ఐశ్వర్య చెప్పింది. స్టేజీపై తన కూతురు మాటలు వింటూనే రజనీకాంత్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఏ కుటుంబంలో అయినా అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే నాన్న డబ్బులు ఇస్తారేమో కానీ సినిమా ఛాన్స్‌ ఇవ్వరు. నా కోసం మాత్రమే ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ ఒప్పుకోలేదు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చే  ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. నాన్నేం చిన్న పిల్లవాడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు. కథలో బలం ఉంది కాబట్టే ఒప్పుకున్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కథకు సెట్‌ అవుతారు. అందుకే నాన్నగారిని ఈ పాత్ర కోసం కలిశాం. ఆయన కూడా బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు.' అని ఐశ్వర్య చెప్పింది.

లాల్‌ సలామ్‌ చిత్రంలో రజనీకాంత్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా హీరోయిజం చూపనున్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ కీలక పాత్రలు పోషించారు. కపిల్‌దేవ్‌, జీవిత రాజశేఖర్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement