RRR Box Office (Japan): SS Rajamouli RRR Movie Sets New Record In Japan, Grosses Over Rs. 80 Crores- Sakshi
Sakshi News home page

RRR Movie: అమెరికాలో రీరిలీజ్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ మరో రికార్డు..

Published Sat, Mar 18 2023 8:18 AM | Last Updated on Sat, Mar 18 2023 9:22 AM

After Japan Release RRR Movie Beats KGF 2 Movie Collection - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక కోసం లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లిన దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ, సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ, నటుడు శ్రీ సింహా తదితరులు శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు.

కాగా ఆస్కార్‌ అవార్డు సాధించడం గురించి రాజమౌళిని స్పందించమని విలేకర్లు అడగ్గా.. ఆయన ‘జైహింద్‌’ అన్నారు. ఇక ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నుంచి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు రామ్‌చరణ్‌. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం గురించి స్పందిస్తూ– ‘‘భారతీయ అభిమానులందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఆదరించారు. ‘నాటు నాటు’ పాటను సూపర్‌ హిట్‌ చేశారు. ‘నాటు నాటు’ పాట మాది కాదు.. ప్రజల పాట. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్‌కి దారి వేసింది, అవార్డు వరించేలా చేసింది. వారితో పాటు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళిగార్లకి కూడా థ్యాంక్స్‌ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌.

తప్పుగా అర్థం చేసుకున్నారు: కాలభైరవ 
ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను పాడినందుకు ఆనందంగా ఉందంటూ ఓ నోట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు కాలభైరవ. ‘‘ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ విలువైన క్షణాలు దక్కడానికి రాజమౌళి బాబా, నాన్న (కీరవాణి), కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ... ఇలా మరికొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారు. యూఎస్‌ టీమ్‌ కూడా హెల్ప్‌ చేసింది. వీరి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఆస్కార్‌ వేదికపై నా ప్రదర్శన వీలయ్యేది కాదు’’ అని ఆ నోట్‌లో చెప్పు కొచ్చారు కాలభైరవ.

కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పేర్లను కాలభైరవ ప్రస్తావించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్స్‌ చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా కాలభైరవ స్పందించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా, ఇందులోని ‘నాటు నాటు’ పాట సక్సెస్‌కు తారక్‌ అన్న, చరణ్‌ అన్న ముఖ్యులు. అందులో సందేహం లేదు. అయితే నేను ఆస్కార్‌ వేదికపై నా ప్రదర్శనకు సంబంధించిన విషయం గురించి మాత్రమే ఆ నోట్‌లో ప్రస్తావించాను. అది తప్పుగా అర్థమైనట్లుంది. అయినప్పటికీ నా మాటలను క్షమించమని అడుగుతున్నాను’’ అని కాలభైరవ పేర్కొన్నారు.  

ఆస్కార్‌ వేదికపై షాక్‌ అయ్యా: గునీత్‌ మోంగా
‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్‌ మోంగా శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మామూలుగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నవారు తమ యాక్సెప్టెన్సీ స్పీచ్‌ను 45 సెకన్లలో పూర్తి చేయాలి. ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ దర్శకురాలు కార్తీకి అన్ని సెకన్లలోనే  పూర్తి చేశారు. కానీ నిర్మాత గునీత్‌ మోంగా  కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకుని మాట్లాడుతుండగా స్పీచ్‌ ఆపాలన్నట్లుగా వెనకనుంచి మ్యూజిక్‌ ప్లే చేశారు ఆస్కార్‌ నిర్వాహకులు. అలాగని నిర్వాహకులు ఈ 45 సెకన్ల నియమంలో కఠినంగా ఏమీ లేరు.

బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు గెల్చుకున్న చార్లీ మాక్సే, మ్యాథ్యూ ఫ్రౌండ్‌లు 45 సెకన్ల కన్నా ఎక్కువగా మాట్లాడినా, నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై గునీత్‌ మోంగా స్పందించారు. ‘‘ఇండియాకు తొలి ఆస్కార్‌ అవార్డును సాధించామనే గొప్ప విషయం గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ నా స్పీచ్‌ను కట్‌ చేశారు. షాక్‌ అయ్యాను. ఇండియా తరఫున నేను మాట్లాడే అవకాశాన్ని నా నుంచి ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది. నేను మళ్లీ ఆస్కార్‌కు వెళతాను. అప్పుడు తప్పకుండా నా గొంతు మళ్లీ వినిపిస్తాను’’ అని పేర్కొన్నారు గునీత్‌.  

అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూడో స్థానం..
భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూడోస్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌ 2’ ఉండేది. తొలుత అత్యధిక గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన ఇండియన్‌ చిత్రాల జాబితాలో వరుసగా ‘దంగల్‌’ (దాదాపు రూ. 1900 కోట్లు), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’(రూ. 1800 కోట్లు),  ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ (రూ. 1230 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (దాదాపు రూ. 1150 కోట్లు), ‘పఠాన్‌’ (రూ. 1050 కోట్లు.. ఇంకా ప్రదర్శిత మవుతోంది) ఉన్నాయి. అయితే గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జపాన్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. అలాగే ‘ఆస్కార్‌’ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఈ నెల 3న, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 10న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను రీ రిలీజ్‌ చేశారు. దీంతో మరికొన్ని కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ వసూళ్లు మొత్తాన్ని కలిపితే ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ గ్రాస్‌ కలెక్షన్స్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దాటిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement