ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది: శ్రీలీల | Sakshi
Sakshi News home page

Sreeleela: అంతా మీ చేతుల్లోనే ఉంది.. కలిసి సాధిద్దాం: శ్రీలీల

Published Sun, Mar 5 2023 12:27 AM

Actress Sreeleela Visit Orphan Home and Shares A Note On Social Media - Sakshi

ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌ శ్రీలీల. పెళ్లిసందD సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ధమాకా సూపర్‌ హిట్‌తో టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అందానికి తోడు అదృష్టం కూడా తోడైనట్లు ఈ సినిమా హిట్‌తో శ్రీలీల క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీనియర్‌ హీరోల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్‌ కూడా ఆ బ్యూటీతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  

ఈ అమ్మడు కేవలం గ్లామర్‌తోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల వారితో కలిసి సందడి చేసింది.  చిన్నారులతో సరదాగా ఆడి పాడింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారులతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్న శ్రీలీల ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజుగా నిలిచిపోతుందని తెలిపింది. జీవితంలో ఇలాంటివి చాలా విలువైనవిగా నిలుస్తాయని అన్నారు. 

శ్రీలీల తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే నా చిన్న సమూహం. పెద్ద కలలతో ఉన్న నా చిన్న పిల్లలు. ఈ క్షణాలు చాలా విలువైనవని వారిని చూసే వరకు మీకు తెలియదు. నా జీవితంలో సంతోషంగా గడిపిన రోజు ఇదే. వారితో, కథలు, డ్యాన్స్, పాటలు, ప్రేమతో ఒకరినొకరు ముంచెత్తడం. ప్రేమతో నిండిన హృదయంతో వారితో ఉండడం నాకు జీవితాతం గుర్తుండిపోతుంది. వారు తమ అందమైన చిన్న చిరునవ్వులతో నన్నుచూసి పొంగిపోయారు. మీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది సాధ్యమేనని నన్ను నమ్మండి. చాలా సార్లు ప్రజలు ఇతరుల కోసం ఉండాలని కోరుకుంటారు కానీ వారికి దిశా నిర్దేశం లేదు. వారికి ఏం చేయాలో... ఎలా చేయాలో తెలియదు.' అంటూ రాసుకొచ్చింది. 

శ్రీలీల ఇన్‌స్టాలో రాస్తూ..' అంతా మీ చేతుల్లోనే ఉంది - ఒక్క ట్యాప్, ఒక్క గూగుల్ సెర్చ్ మీ చుట్టూ ఉన్న అందమైన పిల్లలను ఆరా తీయండి. ఇది చూసి మీరు విపరీతమైన విరాళాలు ఇస్తారని నేను ఆశించట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు అత్యంత విలువైన సమయం, మీ ప్రేమ వారికి పంచండి. వారికి కావలసింది అదే.. వారానికి లేదా నెలకు ఒకసారి వారితో భోజనం చేస్తూ సమయాన్ని వెచ్చించండి. ఇది కడుపు నింపడమే కాదు, వారి హృదయాలను నింపుతుంది. నిండు మనసుతో #Hereforyouను ప్రారంభిద్దాం. మీరు అనాథాశ్రమాన్ని లేదా అలాంటి ఏదైనా సంస్థను సందర్శించినప్పుడల్లా ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి, #Hereforyouని ట్యాగ్ చేయండి. మీ చిత్రాలను చూడటానికి నేను ఎదురు చూస్తున్నా. దీన్ని కలిసి చేద్దాం. చేయి చేయి కలిపి ##Hereforyou.' అంటూ రాసుకొచ్చింది. అనాథ అశ్రమంలోని పిల్లలను కలిసి శ్రీలీల ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని ఒక్కసారైనా కేటాయించండి అంటూ అభిమానులను కోరింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement