ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల | Actress Sreeleela about Robinhood movie: Tollywood | Sakshi
Sakshi News home page

ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల

Published Wed, Mar 26 2025 12:12 AM | Last Updated on Wed, Mar 26 2025 12:12 AM

Actress Sreeleela about Robinhood movie: Tollywood

‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్‌గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్‌ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. 

‘రాబిన్‌హుడ్‌’ సినిమాలో ఫారిన్‌ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్‌ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్‌లో నీరా వాసుదేవ్‌ లాంటి ఫన్‌ రోల్‌ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్‌గారితో వర్క్‌ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్‌ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్‌ పెయిర్‌గా పేరు వస్తుంది. ‘రాబిన్‌హుడ్‌’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. 

నీరా వాసుదేవ్‌ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్‌ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్‌ చేసి, ఈ రోల్‌ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది.  

‘పుష్ప ది రూల్‌’ సినిమాలో ‘కిస్సిక్‌’ స్పెషల్‌ సాంగ్‌ చేశాను. ఈ సాంగ్‌ సక్సెస్‌ తర్వాత ఆ తరహా స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్‌’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్‌కి బదులుగా మంచి రోల్స్‌ చేయాలనుకుంటున్నాను. 

2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్‌ కూడా వర్క్‌ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్‌గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్‌ ఇయర్‌ మెడికల్‌ ఎగ్జామ్స్‌ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్‌లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.

ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్‌ జాతర’, శివ కార్తికేయన్‌గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్‌’ సినిమా చేస్తున్నాను.  ‘రాబిన్‌ హుడ్‌’లో కేతికా శర్మ చేసిన స్పెషల్‌ సాంగ్‌ ‘అదిదా సర్‌ప్రైజ్‌’లోని కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్‌. ఆ తరహా డ్యాన్స్‌ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్‌గా ఏం చెప్తారు? 

‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్‌గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్‌ అనేవి చేసేవారి కంఫర్ట్‌ లెవల్స్‌పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్‌ జోన్‌ అనేది పర్సన్‌ టు పర్సన్‌ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా నేను ఎన్నో సాంగ్స్‌ చేశాను. శేఖర్‌ మాస్టర్‌తో కూడా చేశాను. 

అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ సినిమాలోని డ్యాన్స్‌ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్‌ మూవ్స్‌పై మహిళా కమిషన్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్‌కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్‌ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.

హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. 
అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్‌ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement