అమ్మను బతికించుకుందామనుకున్నా.. ఆస్పత్రికి తెలిసి తెల్లారేసరికి.. | Sakshi
Sakshi News home page

Lathasri: దారుణం.. డబ్బుల కోసం ఐసీయూలో అమ్మ ప్రాణాలతో చెలగాటం.. ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌లో!

Published Thu, Jan 11 2024 1:56 PM

Actress Lathasri Gets Emotional Over Her Mother took Wrong Treatment - Sakshi

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి క్రేజ్‌ తెచ్చుకుంది నటి లతాశ్రీ. ఈమె అసలు పేరు పద్మలత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మొదట శ్రీలతగా, తర్వాత లతా శ్రీగా మార్చుకుంది. తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఈమెకు నాగశౌర్య మేనల్లుడు అవుతాడు. తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

అందరిముందే తిట్టాడు
లతా శ్రీ మాట్లాడుతూ.. 'హీరోయిన్‌గా తెలుగులో నా తొలి సినిమా మన్మథ సామ్రాజ్యం. కన్నడలో హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు వచ్చేవి. కానీ అమ్మ తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. అలా ఇక్కడ మొదట్లో హీరోయిన్‌గా తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశాను. కానీ ఎన్నడూ నా పాత్రలకు నేను డబ్బింగ్‌ చెప్పలేదు. మలయాళంలో మమ్ముట్టితో నటించే ఛాన్స్‌ వచ్చింది. అయితే సెట్స్‌లో డైరెక్టర్‌ నా నటనకు వంకలు పెట్టాడు. అందరిముందే తిట్టడంతో ఏడ్చేశాను. నన్ను ఇబ్బందిపెట్టడంతో సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ మలయాళ సినిమాల జోలికి పోలేదు.

జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ, పెళ్లి
ఆ రోజుల్లో ఉదయం పూట ఏరోబిక్స్‌కు వెళ్లేదాన్ని. అక్కడ ఉండే జిమ్‌ ట్రైనర్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. ఏడాదిపాటు ప్రేమించుకున్నాం. ఆ సమయంలో సినిమా ఛాన్సులు రిజెక్ట్‌ చేశాను. అమ్మకు అసలు విషయం లీకవడంతో కోపంతో ఒక్కటిచ్చింది. ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. వాళ్ల నాన్న డిప్యూటీ కలెక్టర్‌. బాగా చదువుకున్న కుటుంబం. కానీ అమ్మకు ఇష్టం లేక నన్ను ఢిల్లీ పంపించేసింది. చివరకు ఎలాగోలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. పెళ్లయ్యాక కూడా తను మాతోనే ఉంది. ఓరోజు విజయవాడ వెళ్లిన అమ్మకు అక్కడ గుండెపోటు వచ్చింది. అప్పుడు అమ్మ వెంట అన్నయ్య, నేను ఎవరమూ లేము.

అమ్మ కోలుకున్నా ఐసీయూలోనే..
ఛాతీలో నొప్పిగా ఉన్నా అదే తగ్గిపోతుందని ఊరుకుంది. రాత్రంతా ఆ నొప్పి భరించింది. తెల్లవారినా నొప్పి తగ్గకపోవడంతో అన్నయ్యకు ఫోన్‌ చేసింది. అప్పుడు అన్నయ్య వెంటనే తనను ఆస్పత్రిలో చేర్పించాడు. అమ్మను ఐసీయూలో చేర్చారు. విషయం తెలియగానే నేను షిరిడీ నుంచి విజయవాడ వెళ్లిపోయాను. అమ్మ నన్ను చూడగానే కోలుకుంది. మామూలు మనిషైపోయింది. బాగానే మాట్లాడింది. అయినా సరే ఆస్పత్రి వైద్యులు డబ్బుల కోసం తనను ఐసీయూలోనే ఉంచారు. మాట్లాడటానికి వీల్లేకుండా నోట్లో పైప్‌ పెట్టారు. ఓరోజు సడన్‌గా కోమాలోకి వెళ్లిపోయిందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. కానీ రెండు రోజుల్లో మళ్లీ కోలుకుంది.

ఆస్పత్రి వాచ్‌మెన్‌ మాటలతో షాక్‌
18 రోజులపాటు తనను ఐసీయూలో నుంచి బయటకు రానివ్వలేదు. హైదరాబాద్‌కు తీసుకెళ్తామన్నా ఒప్పుకోలేదు. ఒకరోజు ఆ ఆస్పత్రి వాచ్‌మెన్‌.. 'చూస్తే చదువుకున్నవాళ్లలా ఉన్నారు. ఈ ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ డబ్బులు గుంజుతారు, కానీ సరైన ట్రీట్‌మెంట్‌ ఇవ్వరు. బతికుండగానే చంపేస్తారు' అని చెప్పాడు. భయంతో ఆ ప్రాంతంలో ఉండే నటి జయలలితకు ఫోన్‌ చేశాను. ఆమె సాయంతో ఆ ఆస్పత్రి నుంచి వేరే హాస్పిటల్‌కు మార్చడానికి సిద్ధమయ్యాము.

షిఫ్ట్‌ చేద్దామనుకునేలోపు చంపేశారు
అయితే దీన్ని సీక్రెట్‌గా ఉంచమన్నారు. కానీ ఇంతలో ఈ విషయం అమ్మ ఉన్న ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు తెలిసింది. వేరే హాస్పిటల్‌కు షిఫ్ట్‌ చేస్తున్నారా? అని అడిగారు. లేదని అబద్ధం చెప్పాను. ఆ మరుసటిరోజే అమ్మ చనిపోయింది. ఆస్పత్రి వైద్యులే తనను బతికుండగానే చంపేశారు. ఆమె చనిపోయాక ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. డబ్బులకోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం చాలా దారుణం' అని ఎమోషనలైంది లతా శ్రీ.

చదవండి: నా తల్లి ముందే అలాంటి బూతులు విన్నాను.. ఆపై తేజూను తీసుకెళ్తామంటూ..: అమర్‌

Advertisement
Advertisement