
తమిళగ వెట్రి కళగం నేత, సినీ నటుడు విజయ్ నివాసంతో పాటు సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపై చెన్నై విమానాశ్రయంలో కూడా బాంబులు ఉన్నట్టుగా బెదిరింపుల కాల్స్ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
విజయ్ నివాసం పరిసరాలలో, సీఎం నివాసం పరిసరాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో సోదాల అనంతరం భద్రతను పెంచారు. ఇప్పటికే విమానాశ్రయానికి పలుమార్లు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. హీరో విజయ్కు ఇప్పటికే రెండుసార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అజిత్, రజనీకాంత్ వంటి స్టార్స్ కూడా గతంలో ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నేపంథ్యంలో వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.