కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’పై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ పేరుతో విజయ్‌ని ఇబ్బంది పెడుతున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వంతో పాటు బీజేపీపై మండిపడుతున్నారు. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని తాము ఆశించామని అభిమానులు ఆకాంక్షించారు. తాజాగా మూవీ విడుదల జాప్యంపై విజయ్ తండ్రి, దర్శక, నిర్మాత ఎస్.ఎ.చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు.
జన నాయగన్ సినిమాతో విజయ్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నకు ఆయన తండ్రి చంద్రశేఖర్ ఇలా అన్నారు. 'విజయ్ చాలా ధైర్యవంతుడు.. మొండోడు కూడా.. ఇలాంటి సవాళ్లకు భయపడే రకం కాదు. తన ప్రయాణంలో చాలా అడ్డంకులను దాటుకొని వచ్చాడు. భవిష్యత్‌లో ఇంతకుమించిన చిక్కులు వస్తాయని విజయ్‌కు తెలుసు. ప్రతి అడ్డంకిని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నాడు. కరూర్ ఘటనతో విజయ్‌ను ఆపాలని చూశారు. అక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అందులో భాగమే జన నాయగన్ సినిమా అంశం కూడా ఉంది. సినిమా ఎందుకు విడుదల కాలేదనేది తమిళ ప్రజలందరికీ తెలుసు. విజయ్ ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో యువత కూడా పాలిటిక్స్ గుర్చి మాట్లాడుతుంది. ఇప్పుడు వారికే అన్ని విషయాలు బాగా తెలుసు.' అని ఆయన అన్నారు.
విజయ్-హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది.


