‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో సాయిపల్లవి నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజైనప్పుడే ఈ చిత్రం సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ను మేకర్స్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపికా పదుకోన్ నటించడం లేదని, ఇటీవల ఓ సందర్భంలో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో కథలో కీలకమైన సుమతి (దీపిక క్యారెక్టర్) పాత్రలో ఎవరు నటించనున్నారనే చర్చ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా తదితర కథనాయికల పేర్లు వినిపించాయి.
తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలోని సుమతి పాత్రలో దక్షిణాదికి బాగా సుపరిచితురాలైన సాయిపల్లవి నటిస్తే బాగుటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి... ‘కల్కి 2’లో సాయిపల్లవి భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని, ప్రభాస్ కూడా పాల్గొంటారని భోగట్టా. ఈ సీక్వెల్‌ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.


