
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)ను తెలుగులో మొదలుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్. తొలి సీజన్‌కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను సక్సెస్ చేశాడు. కానీ తర్వాత మాత్రం ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో హీరో నాని (Nani) ధైర్యం చేసి యాంకర్‌గా మారాడు. ఇది రియాలిటీ షో అన్న విషయం మర్చిపోయి గేమ్ షోనే కదా.. హోస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. తన యాంకరింగ్ కూడా బాగానే ఉండేది.
రెండో సీజన్ హోస్ట్ నాని
కానీ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం నానిపై విమర్శలు చేసేవారు. తన జడ్జిమెంట్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఇదంతా చూసి నానికి దిమ్మతిరిగిపోయింది. ఏదో హోస్ట్‌గా వచ్చిన పాపానికి చెడుగుడు ఆడేసుకుంటున్నారని అప్‌సెట్ అయ్యాడు. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజనే.. తన ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఇంకెప్పుడూ ఈ రియాలిటీ షో జోలికి వెళ్లనన్నాడు.
అదే ఆఖరి రోజు
ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు. నాని మాట్లాడుతూ.. నా జీవితంలో బిగ్‌బాస్ చాప్టర్ ముగిసిపోయింది. మళ్లీ దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. రెండో సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్‌బాస్ హోస్ట్‌గా నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అని పోస్ట్ పెట్టాను.
బయటి ప్రపంచం తెలిసింది
బిగ్‌బాస్.. బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్లు చూపించింది. నన్ను మరింత టఫ్‌గా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్లాను. ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా? అనిపించింది. అయితే చాలామంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయ్.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్‌బాస్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదని నాని చెప్పకనే చెప్పాడు.
చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి