
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా ప్రతిఒక్కరిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా దీనికి బాధితులే. తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి చిరు స్పందించారు. వాటి గురించి తాను మాట్లాకపోయినా తను చేసిన మంచే మట్లాడుతుందని అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఓ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: 'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ)
'సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు మీరు ఎందుకు స్పందించరు అని అందరూ అడుగుతుంటారు. నేనెప్పుడూ స్పందించను ఎందుకంటే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానులు చూపించే ప్రేమే నాకు రక్షణ కవచాలు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మంచితనమే మాట్లాడుతుంది. మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికీ స్పందించను. నాలాగే మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను. ఇతర దేశాల్లోని అభిమానులు కూడా నా మాటని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేస్తున్నారు. నా పేరుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు'
'కొన్నాళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలన్నారు. తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే.. ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది. 'చిరంజీవి అన్నని మాటలు అనాలని ఎందుకు అనిపించింది?' అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఆమె వివరాలు కనుక్కొంటే.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే నేనంటే గౌరవం అని తెలిసింది. ఆ మాటలు విని నా హృదయం ఉప్పొంగింది' అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)