టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ లేదనే విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్ ఉంది. విజయ్ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్ కామ్రేడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది.


