సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్‌గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్‌పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్‌లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.
అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.
(ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య)


