Aamir Khan Kiran Rao Announce Divorce: Full Details In Telugu - Sakshi
Sakshi News home page

కొత్త జీవితం కోసం విడిపోతున్నాం!

Jul 3 2021 12:05 PM | Updated on Jul 4 2021 12:23 AM

Aamir Khan Kiran Rao Announce Divorce: Full Details In Telugu - Sakshi

Aamir Khan Kiran Rao Divorce: ‘‘ఈ 15 ఏళ్ల ప్రయాణంలో ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని, అనుభూతులను పంచుకున్నాం. మా బంధం బలపడటానికి కారణం – ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ. ఇప్పుడు మేమిద్దరం మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనుకుంటున్నాం. ఇక మేం ఎప్పటికీ భార్యాభర్తలం కాదు. అయితే మా బాబు ఆజాద్‌ని కలిసి పెంచుతాం’’ అని శనివారం హిందీ నటుడు–నిర్మాత–దర్శకుడు ఆమిర్‌ ఖాన్, ఆయన భార్య –నిర్మాత–దర్శ కురాలు కిరణ్‌ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. విడిపోవాలనే నిర్ణయాన్ని ఈ ఇద్దరూ చాలా రోజుల క్రితమే తీసుకున్నారట. 

‘‘ఇది కొన్ని రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ విడిపోవడానికి కావల్సినవన్నీ పూర్తి కావడంతో విడివిడిగా జీవితాలను ఆరంభించడానికి ఇది సరైన సమయం అనిపించింది. కుటుంబ సభ్యుల బాధ్యతలు నిర్వర్తించడానికి, వృత్తిపరంగా కలిసి పని చేయడానికి మేం సుముఖంగా ఉన్నాం. అలాగే ‘పానీ’ ఫౌండేషన్‌ వ్యవహారాలను ఇద్దరం కలిసే చూసుకుంటాం. నిజానికి మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకోవడంవల్లే విడిపోవాలనే నిర్ణయం తీసుకోగలిగాం. వారికి ధన్యవాదాలు. ఈ విడాకులు అంతం కాదు. మా కొత్త జీవితానికి ఆరంభం అని అనుకుంటారని భావిస్తున్నాం’’ అని ఆమిర్‌ఖాన్, కిరణ్‌ పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే... ‘లగాన్‌’ సినిమాలో నటిస్తున్నప్పుడు కిరణ్‌ రావుని తొలిసారి కలిశారు ఆమిర్‌ ఖాన్‌. ఆ సినిమాకు  ఆమె దర్శకత్వ శాఖలో చేశారు. అయితే ఆ సినిమా అప్పుడు వీళ్ల మధ్య స్నేహానికి మించిన బంధం ఏదీ ఏర్పడలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆమిర్‌ ఖానే చెప్పారు. అయితే 2002లో ఆమిర్‌ తన భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న సమయంలో ఏదో పని మీద కిరణ్‌ ఫోన్‌ చేశారట. ‘‘ఆ రోజు ఆమెతో దాదాపు అరగంట మాట్లాడాను. ఫోన్‌ పెట్టేశాక ‘ఈమెతో మాట్లాడితే ఇంత ఆనందంగా ఉందేంటి?’ అనిపించింది’’ అని ఆమిర్‌ ఆ తర్వాత ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు మనసులూ కలవడం, పెళ్లి వరకూ వెళ్లడం 
తెలిసిందే. 

2005 డిసెంబర్‌ 28న ఆమిర్, కిరణ్‌ల వివాహం జరిగింది. ఆ తర్వాత అద్దె గర్భం ద్వారా 2011లో వీరికి బాబు పుట్టాడు. ఆమిర్, రీనా దత్తాకి ఒక బాబు జునైద్, పాప ఐరా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement