
ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం.. ఓటీటీలకు దూరం
థియేటర్ రన్ తర్వాత అమిర్ సినిమాలు ఎక్కడ చూడొచ్చంటే..
బాలీవుడ్ ఆగ్ర నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) థియేటర్‌లో విడుదలైన తర్వాత డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో విడుదల చేసే యోచనలో ఉన్నారు. సినిమాలపై ఓటీటీల ప్రభావం తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎనిమిది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు.
అమీర్ ఖాన్ కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' జూన్ 20న విడుదల కానుంది. సాధారణంగా థియేటర్ రన్ 8వారాలు పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సిందే. అయితే, దానిని అమీర్ బ్రేక్ చేయనున్నారు. ఓటీటీలో కాకుండా యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. అది కూడా చాలా రోజుల తర్వాతే అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆ సమయంలో సినిమా చూడాలనుకునే వారు చిత్ర నిర్మాతలు సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ చెప్పిన మాట ప్రకారం ఇలా ఓటీటీని బాయ్‌కాట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. 'థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నాయిని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నేను నటించే సినిమాలు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను. వాటిని థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేస్తాను. అభిమానులు కూడా నా సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలని కోరుకుంటారు. అందుకే నా మూవీని థియేటర్స్‌లో విడుదల చేస్తాను. దీంతో సినిమా వ్యాపారం బలం పుంజుకుంటుందని నమ్ముతున్నాను.' అని అన్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్‌ను థియేటర్లకు రావొద్దని మనమే పరోక్షంగా చెబుతున్నామని, అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 2007లో వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా ఈ చిత్రం రానుంది.