
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబయి చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్‌ను కలిసి పరామర్శించారు. అమిర్‌తో పాటు ఆయన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి బోనీ కపూర్ నివాసానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.
కాగా.. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ మే 2న అనారోగ్యంతో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ తర్వాత ఎస్వీ రోడ్‌లోని విలే పార్లే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ కుటుంబంతో సాన్నిహిత్య కారణంతో ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీరితో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ లాంటి ప్రముఖులు కూడా బోనీ నివాసంలో కనిపించారు.