థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్‌కు ఊపిరి పోస్తాయా? | 10 Small Budget movies in theaters by Tollywood | Sakshi
Sakshi News home page

థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్‌కు ఊపిరి పోస్తాయా?

Mar 5 2026 11:49 PM | Updated on Mar 5 2026 11:54 PM

10 Small Budget movies in theaters by Tollywood

తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌కు ఊపిరి పోయేలా రేపు (శుక్రవారం) ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.

మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు, ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్‌ కథ అందించగా, తమన్‌ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్‌ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్‌లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement