నేడు లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బుల జమ
పాపన్నపేట(మెదక్): బడుగు జీవులకు ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చింది. అర్హులకు నూతనంగా పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా (డీబీటీ) పింఛన్ డబ్బును జమ చేసేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆమోదంతో ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 11,597 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 18 వరకు ప్రజల నుంచి 12,357 దరఖాస్తులు స్వీకరించారు. పంచాయతీ కార్యదర్శి, ఎంిపీడీఓ, డీఆర్‌డీఓల పరిశీలన అనంతరం 11,597 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వితంతు పింఛన్లు 7,849, దివ్యాంగులు 1950, ఒంటరి మహిళలు 1,258, గీత కార్మికులకు 540 పెన్షన్లు మంజూరయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లాలో 1,05,579 మంది లబ్ధిదారులున్నారు. వారికి నెల నెలా రూ. 23,97,56,912 డబ్బులను అందజేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య 34,132, వితంతు 42,102, దివ్యాంగులు 7,786, గీత కార్మికులు 814, చేనేత 428, పైలేరియా 429, డయాలిసిస్ 145, బీడీ వర్కర్లు 15,608, ఒంటరి మహిళలకు 4,036 పింఛన్లు అందుకుంటున్నారు.


