ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వివక్ష
మెదక్‌జోన్: గూడు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అసలే గూడు లేని వారిని ఆదుకోవాల్సింది పోయి వివక్ష చూపుతున్నారు. ఫలితంగా పేదలు నిత్యం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది.
11 వేల పైచిలుకు మంజూరు
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకతీతంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతగూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు నీరుగారుస్తున్నారు. గ్రామాల్లో ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకొని అర్హులైన ఎంతో మందికి ఇళ్లు దక్కకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2 విడతల్లో 11 వేల పైచిలుకు ఇళ్లు మంజూరు కాగా, మొదటి విడతలో 9 వేలు మంజూరయ్యాయి. రెండో విడతలో పూరి గుడిసెలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఆర్‌సీసీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో వారు ఇల్లు కావాలని అడగకున్నా మరో 2 వేలు మంజూరు చేశారు. అయితే అసలే ఇల్లులేని వారు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదని పలువురు వాపోతున్నారు.
నేతల తీరుతో నష్టం
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో పూరి గుడిసెలు గల వారికి సైతం ప్రత్యేకంగా మంజూరు చేసినప్పటికీ మరికొందరిని మాత్రం విస్మరించారు. గతంలో ఆర్థికంగా లేని వారు గోడలు నిర్మించి వాటిపై రేకులు వేసుకున్న వారికి సైతం రూ. 2 లక్షలు మంజూరు చేస్తామని, అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం గోడలపై స్లాబు వేసుకునే అవకాశం ఇందిరమ్మ పథకంలో కల్పిస్తుందని చెబుతున్నారు. కానీ ఇళ్లు లేని వారు జిల్లాలో వందలాది మంది నిరుపేదలు ఉన్నారు. వారంతా చిన్నపాటి పూరి గుడిసెలు, అద్దె ఇళ్లలో కిరాయికి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని వేడు కుంటున్నా, అఽధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రజావాణిలో సైతం దరఖాస్తు చేసినా విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో నేతలతో తలెత్తిన చిన్నపాటి విబేధాల కారణంగా పథకానికి అర్హులైనప్పటికీ ఇళ్లు మంజూరు చేయడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
కొందరికి మాత్రమే కేటాయింపు
అర్హులను విస్మరిస్తున్న అధికారులు
జిల్లాలో వందలాది మంది ఎదురుచూపు
పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ యాదమ్మ. తూప్రాన్ మండలం దాతర్‌పల్లి గ్రామం. కొన్నేళ్లుగా పూరి గుడిసెలో ఉంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తోంది. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులు, నాయకులను వేడుకున్నా పట్టించులేదు. దీంతో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది.


