స్వీకరించిన అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో సోమవారం కలెక్టరేట్ కిటకిటలాడింది. అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 85 అర్జీలు రాగా, భూ భారతి 15, ఇందిరమ్మ ఇళ్లు 10, పెన్షన్లు 5, ఇతర సమస్యలపై 55 వినతులు వచ్చాయి. మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన బంజపల్లి రాజమ్మ భర్త బీరయ్య తమ కొడుకు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు అందజేశారు. అలాగే చేగుంట మండలం జైత్రం తండాలో భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వెంటనే సర్వే చేసి న్యాయం చేయాలని గిరిజనులు ప్రజావాణిలో విన్నవించారు. అలాగే మాలల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన ఎస్సీలకు డబుల్‌బెడ్రూం ఇళ్లతో పాటు పీఎం అజయ్ పథకం కింద చార్జింగ్ స్కూటీలు అందజేయాలని కోరారు. అలాగే బాలల ప్రజావాణికి మొత్తం 5 దరఖాస్తులు వచ్చాయి. అందులో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న తమ పిల్లలకు ప్లేస్‌మెంట్ ఇవ్వకపోవడంతో వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని పెద్దశంకరంపేటకు చెందిన విద్యార్థి తండ్రి దుర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గజ ఈతగాడుగా ఏడుపాయల్లో పనిచేసి బాధితులను కాపాడుతూ చనిపోయాడని, పరిహారం అందించాలని పాపన్నపేటకు చెందిన ఓ బాలుడు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ నిర్వహణ అధికారి యూనుస్‌తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


