కఠిన చర్యలు తప్పవు
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కొల్చారం(నర్సాపూర్): మంజీరా నది సాగు, తాగు నీటి వరదాయిని. ఈ ఏడాది ఎగువన సింగూరు నుంచి నీరు విడుదల కాకపోవడం, మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ కానరాకపోవడంతో ప్రస్తుతం నది ఎడారిని తలపిస్తోంది. మొన్నటి వరకు పరివాహక ప్రాంతంలోని రైతులు పంటలను కాపాడుకునేందుకు నదిలోని ఇసుక తిన్నెల కింద ఉన్న నీటి కోసం గోతులు తీసి కిలోమీటర్ల మేర పైపులైన్లను ఏర్పాటు చేసుకొని పంటలు దక్కించుకున్నారు. ప్రస్తుతం నది నుంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణాను జోరుగా కొనసాగిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో నది పరివాహక ప్రాంతాల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆగని అక్రమ దందా
రాత్రి 8 అయ్యిందంటే ఇసుక అక్రమ రవాణాకు అక్రమార్కులు తెరలేపుతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లను నదిలోకి దించి తెల్లవారుజాము వరకు ఇసుకను సుదూర ప్రాంతాలకు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. పాపన్నపేట మండలానికి చెందిన కొందరు కొల్చారం మండలం తుక్కాపూర్ శివారు, మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. వీరికి అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. వీరికి మండలంలోని కొంతమంది తోడయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను ఎక్కడికక్కడ తవ్వుతుండటంతో నదిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గొయ్యిలు దర్శనమిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇసుక తిన్నెల కింద ఉన్న నీరు ఆవిరై భూగర్భజలాలు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉంది.
మంజీరా నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తే సమాచారం అందించాలి. వారి పేర్లను గోప్యగా ఉంచుతాం. ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ఇప్పటికే నది వెంట కొన్ని చోట్ల స్ట్రెంచ్ తీశాం. అయినా కొత్తదారుల వెంట ఇసుక రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
– శ్రీనివాస్‌చారి, తహసీల్దార్, కొల్చారం


