ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం

Nov 17 2026 8:11 AM | Updated on Nov 17 2026 8:11 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌

నర్సాపూర్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వివేక్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామన్నారు. నర్సాపూర్‌ ఏరియాకు చెందిన మహిళలకు పెట్రోల్‌ బంక్‌ సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 19న సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో డబుల్‌బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం తప్పుడు విచారణ చేసిన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. పథకాల అమలులో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఇందిరమ్మ బీమా పథకంలో నిబంధనలు సడలించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,075 పింఛన్లు మంజూరయ్యాయని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ రామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చెశ్‌యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వేదికపైకి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను అనుమతించకపోవడంతో ఆ పార్టీ నాయకులు సీఐ రంగకృష్ణ తదితరులతో వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ వారికి నచ్చజెప్పి అనుమతించడంతో సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement