ఇదేం పని ‘గురు’ | - | Sakshi
Sakshi News home page

ఇదేం పని ‘గురు’

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

కఠిన చర్యలు తప్పవు

విద్యార్థినులతో ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన

పవిత్ర వృత్తికి కొంతమంది ఉపాధ్యాయులు కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవితకు బాటలు వేయాల్సిన వారే పక్కదారి పడుతున్నారు. గత నెలలో ఓ ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక పలువురు విద్యార్థినులు ఏకంగా 1098 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఆఘటన జరిగి నెలరోజులు గడవక ముందే ఇటీవల మరో విద్యార్థిని పట్ల టీచర్‌ ఆసభ్యంగా ప్రవర్తించారు. విచారణ జరిపిన సదరు అధికారులు తాజాగా ఆ ప్రబుద్ధుడిని సస్పెండ్‌ చేశారు. – మెదక్‌జోన్‌

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే కొందరు గురువుల తీరు మొత్తం ఉపాధ్యాయ లోకాన్నే విస్మయానికి గురి చేస్తోంది. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్థినుల అసభ్యంగా ప్రవర్తిస్తూ పవిత్ర వృత్తికే కళంకం తెస్తున్నారు. నెలరోజుల క్రితం పాపన్నపేట మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో బాధిత విద్యార్థినులు గర్ల్‌ అండ్‌ చైల్డ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవటంతో ఏకంగా 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు నిజమని తేలడంతో అతడిని సస్పెండ్‌ చేశారు. అది జరిగి నెలరోజులు గడవక ముందే ఇటీవల వెల్దుర్తి మండలం ఏదుల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులను బ్యాడ్‌ టచ్‌ చేయటంతో పాటు వంట నిర్వాహకులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నిజమని తేలటంతో తాజాగా అతడిని సస్పెండ్‌ చేశారు. అయితే ఆ టీచర్‌ గతంలో ఇదే మండలం యశ్వంతరావుపేట ఉన్నత పాఠశాలలో పనిచేసిన సమయంలోనూ విద్యార్థినుల పట్ల ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిని వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా ఇక్కడికి పంపించారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో సస్పెండ్‌కు గురయ్యారు.

శాశ్వతంగా తొలగించాలి!

గతంలోనూ హవేళిఘణాపూర్‌ మండలం కూచన్‌పల్లి, పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలోనూ ఇదే విధంగా విద్యార్థినులను టీచర్లు వేధించిన ఘటనలు ఉన్నాయి. వారిని సస్పెండ్‌ చేసినా అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. తాత్కాలిక చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేయటంతో వారు పైరవీలు చేసుకొని మళ్లీ విధుల్లో చేరుతున్నారు. అయితే విధుల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే మిగితా వారు అలాంటి తప్పు చేయాలంటేనే జంకుతారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు సైతం ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నల్లు తెలుస్తోంది. పాపన్నపేట మండలంలో సస్పెండ్‌ అయిన టీచర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున పైరవీలు చేయటంతో నెల రోజులు గడవక ముందే విధుల్లోకి తీసుకున్నట్లు తెలిసింది.

ముందుకు రాని పేరెంట్స్‌

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. దీంతో తప్పు చేసిన కీచక టీచర్లు తప్పించుకుంటున్నారు. ఏదుల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో మైనర్‌ విద్యార్థిని బ్యాడ్‌ టచ్‌ చేసిన టీచర్‌పై కేసు పెడితే ‘పోక్సో’ ప్రకారం అతడికి జైలు శిక్షతో పాటు ఉద్యోగం కోల్పోయేవారని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

నెలరోజులు గడవకముందే జిల్లాలో మరో ఘటన

సదరు టీచర్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు

తాత్కాలిక చర్యలతో సరి.. పైరవీలతో విధుల్లోకి

ఆందోళనలో తల్లిదండ్రులు

వెల్దుర్తి మండలం ఏదుల్లపల్లి పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశాం. పవిత్రమైన వృత్తిలో ఉంటూ సభ్య సమాజం తలదించుకునేలా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. – రాజు, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement