రామాయంపేట(మెదక్)/నిజాంపేట: ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇక నుంచి రూ. 230కే సిమెంట్ బస్తా అందజేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం రామాయంపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. రామాయంపేటలో ప్రతిష్టాత్మకంగా రూ. 200 వందల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణంతో పాటు పట్టణంలోని సర్కిళ్ల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అంతకుముందు గుల్పర్తిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని, మార్కెట్ కమిటీ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, వైస్ చైర్‌పర్సన్ నవనీత, తహసీల్దార్ రజని, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు స్వామి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని చౌకత్‌పల్లిలో ఎమ్మెల్యే రోహిత్ పర్యటించారు. నూతన పంచాయతీ భవనం, ఎంపీపీఎస్ స్కూల్ ప్రహరీని ప్రారంభించారు. అనంతరం కల్వకుంటలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎంపీడీఓ ముజాహిద్, ఎంపీఓ రజినీకాంత్ రెడ్డి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ. 230కే సిమెంట్ బస్తా


