పాపన్నపేట(మెదక్): ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19న సిద్దిపేట కేంద్రంగా ఈ పథకం ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ఇక నుంచి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసేలా పథకాన్ని రూపొందించారు. ఈనెల 20 నుంచి 30 వరకు తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా, జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,68,677 కుటుంబాలు ఉన్నాయి.
పాత పథకాలన్నీ విలీనం
గతంలో అమల్లో ఉన్న రైతు బీమాను ఆగస్టు 13 నుంచి నిలిపివేశారు. గత జూన్ 2న ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు పరిచే ఉద్దేశంతో పథకాన్ని కొనసాగించలేదనే అభిప్రాయాలు వెలుబడ్డాయి. కాగా పాస్‌పుస్తకం ఉన్న 60 ఏళ్ల లోపు రైతులు ప్రమాదంలోనే గాక, సహజంగా మరణించినా రూ. 5 లక్షల బీమా చెల్లించేవారు. దీనికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి, ఎల్ఐసీ ద్వారా అమలు చేసింది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షలు ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.2 లక్షల బీమా పథకం అమలవుతుంది. కార్మిక శాఖ ద్వారా ఆటో డ్రైవర్లు, ఇతర వర్గాల వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం ద్వార సహాయం అందుతుంది. వడదెబ్బ ఇతర కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే రూ.4 లక్షల సామాజిక బీమా పథకాన్ని రెవెన్యూ శాఖ అమలు చేస్తుంది. ఇవి గాక మరికొన్ని వర్గాలకు బ్యాంకులు, ఇతర బీమా పథకాలు అమలవుతున్నాయి. ఇవన్నీ 60 ఏళ్ల లోపు వారికే అమలు చేస్తున్నారు. వీటన్నింటిని ఒకే గూటి కిందకు తెచ్చి, ఇందిరమ్మ బీమా పథకం వర్తింప చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈయితే పూర్తి స్థాయి విధి విధానాలు నిర్వహించే శాఖ, నిధుల కేటాయింపుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై పాపన్నపేట తహసీల్దార్ సతీశ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, పూర్తిస్థాయి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు.
19న సిద్దిపేటలో ప్రారంభం
20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం
జిల్లాలో 1,68,677 కుటుంబాలు


