పాపన్నపేట(మెదక్): పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్ గురువారం సస్పెన్షన్‌కు గురయ్యారు. మండల పరిధిలోని డాక్యా, రాజ్యా, ధంజ్యా, పోంలా తండాల ఉపాధి పనుల్లో (వీబీజీరామ్‌జీ) 790 మంది గిరిజనుల పేర్లు గల్లంతయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కరువు వేళ ఉపాధి పనులు చేయడానికి వారికి అవకాశం లేకుండా పోయిందని, గత సోమవారం డాక్యాతండా సర్పంచ్ స్వప్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీడీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ధ్రువీకరించారు. అయితే 2022లో రాష్ట్ర సాఫ్ట్వేర్ నుంచి కేంద్ర సాఫ్ట్‌వేర్‌లోకి మారినప్పుడు ఉపాధి హామీ పనుల్లో పని చేస్తున్న వేలాది మంది జాబ్ కార్డులు మిస్ అయినట్లు తెలిసింది. ఆధార్, జాబ్ కార్డులు మిస్ మ్యాచ్ కావడంతో ఇవి తిరిగి నమోదు కాలేనట్లు సమాచారం. 2026 జూలైలో వీబీజీరాంజీ అమల్లోకి వచ్చాక, ఇటీవల 15 రోజుల క్రితం ఎల్‌నినో నేపథ్యంలో అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు ఉండాలని కేంద్రం ఆదేశించింది. కాగా పాపన్నపేట మండలంలో వందలాది మంది పేర్లు జాబ్ కార్డుల్లో చేర్చినప్పటికీ, ఇప్పటికీ పలు గ్రామాల్లో వేలాది మందికి కార్డులు లేవని సమాచారం. ఇదిలాఉండగా ఎంపీడీఓ విష్ణువర్ధన్ స్థానంలో ఎంపీఓ శ్రీశైలంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.


