ఎల్‌నినోను విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రైతునేస్తం పేరిట గురువారం నుంచి గ్రామ సభలను ప్రారంభించారు. ఈ నెల 22 నుంచి 45 రోజుల పాటూ ప్రతీ గామంలోనూ రైతునేస్తం సభలను నిర్వహించనున్నారు. ‘కేత్‌బచావో అభియాన్’కార్యక్రమం ద్వారా ఆరుతడి పంటలను సాగుచేయటంతోపాటు, సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. రబీలో వరికి బదులు కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలంటూ వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు ప్రచారాన్ని ప్రారంభించారు. –మెదక్‌జోన్
మెతుకుసీమ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోయినా బోరుబావుల ఆధారంగానే 90% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ప్రతీ ఏటా రబీ, వానాకాలంలో 3 లక్షల నుంచి 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. అందులో ప్రతీ సీజన్‌లో సింహభాగం వరిపంటలనే సాగు చేస్తారు. కాగా, ఈ ఏడాది వానాకాలం నుంచి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవలేదు. దీనికి తోడు కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతున్నారు. దీంతో ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు అధికారులతో అన్నదాతలకు రైతునేస్తం సభలను ఏర్పాటు చేసి వరికి బదులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసేవిధంగా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. ఈ నెల 22 నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 45 రోజుల పాటు గ్రామసభలను కొనసాగించనున్నారు.
ఆరుతడి పంటలు మాత్రమే...!
ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ రబీసీజన్‌లో ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని నెలన్నర పాటు కొనసాగే గ్రామ సభల్లో రైతులకు వ్యవసాయ, ఉద్యానవన, ఫిషరీస్, వెటర్నరీతోపాటు పలుశాఖల అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మట్టిపరీక్షల నిర్వహణ, ఆరుతడి పంటలసాగు, సేంద్రీయ ఎరువుల జీవ ఉత్పత్తుల తయారీ, వాటి వినియోగంపై శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించటం, నీటిసంరక్షణ, వర్షపు నీటి నిల్వలపై అవగాహన సుస్థిర వ్యవసాయ సాగు పద్ధతులను ప్రోత్సహించటంపై అవగాహన కల్పించనున్నారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో..!
కాగా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఈ రబీసీజన్‌లో 4,262 ఎకరాలలో వివిధ రకాల ఆరుతడి పంటలను సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. గతేడాది ఈ శాఖ పరిధిలో 1,130 ఎకరాల్లో ఆయిల్‌ఫాంతో పాటు పలురకాల ఆరుతడి పంటలను సాగు చేయగా ఈ ఏడాది ఏకంగా 4,262 ఎకరాల్లో ఆయిల్‌ఫాంతో పాటు ఇతర పంటలను సాగు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గతేడాదితో పోల్చితే ఏకంగా 3,132 ఎకరాల్లో ఆరుతడి పంటలు పెరగనున్నాయి. ఇందులో 100 ఎకరాల్లో జామ, మామిడి, బొప్పాయి, నిమ్మ పండ్లతోటలను సాగు చేయనున్నారు. అలాగే 1,485 ఎకరాల్లో కూరగాయలు, 156 ఉల్లి సాగు, 1,897 ఎకరాల్లో ఆయిల్‌ఫాం, మరో 624 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఒక్క ఎకరం వరి నీటితో 5 ఎకరాల్లో ఆరుతడి
ఒక్క ఎకరం వరి పంటకు ఉపయోగించే నీటితో ఐదెకరాల్లో ఆరుతడి పంటలను పండించుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కూరగాయలతోపాటు ఆయిల్‌ఫాం, పండ్లతోటలు, ఇతర ఏరకమైన ఆరుతడి పంటలను సాగుచేసుకునే వీలు ఉంటుందని గ్రామ సభల్లో విరివిగా ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 22నుంచి వచ్చేనెల 30 వరకు సభలు
ఆరుతడి పంటలే సాగు చేసేలా అవగాహన
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రణాళిక


