తూప్రాన్: రైతులకు భవిష్యత్తులో ఎలాంటి భూతగాదాలు, ఇబ్బందులు రాకుండా చూడాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సర్వేను నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో కొనసాగుతున్న భూ సర్వే ప్రక్రియను ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సర్వే రికార్డులను, సరిహద్దుల గుర్తింపును తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...క్షేత్రస్థాయిలో సర్వే అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ పక్కా వివరాలతో, అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు మనోహరాబాద్ మండలంలో 1,200 ఎకరాల్లో భూ సర్వే పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సర్వే పక్కాగా పూర్తి కావడం వల్ల భవిష్యత్తు తరాలకు భూ సమస్యలు ఉండవని, రైతులు నిశ్చింతగా ఉండవచ్చని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, రైతుల భాగస్వామ్యంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఆర్డీవో బావయ్య, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్వే సిబ్బంది నాగరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


