● పంట కొట్టుకుపోయి ఏడాది
● నష్టపోయిన రైతులు
భారీ వర్షాలకు కుంటలు కొట్టుకుపోయి రైతుల పంటలు నాశనమై ఏడాది గడిచింది. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ చెప్పి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు పైసా పరిహారం అందలేదు. అధికారులను పలుమార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది. పరిహాసం చేస్తున్న నష్టపరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వెక్కిరింతలే మిగులుతున్నాయి తప్ప పరిహారం అందని ద్రాక్షగా మారింది. –అల్లాదుర్గం(మెదక్)
అల్లాదుర్గంలో ఖరీఫ్‌లో కుంట కొట్టుకుపోయి పంట నష్టపోగా, రబీ సీజన్‌లో పంటలే వేయకుండా రైతులు నష్టపోయారు. అయితే చెరువు కింద రైతులు బోర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారు. 2025 ఆగస్టులో భారీ వర్షాలు కురవగా బంటికుంటకు గండిపడటంతో చెరువు కింద రైతులు వేసిన వరి, పత్తి పంట పూర్తిగా కొట్టుకుపోయి సుమారు 20 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతుల పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో రబీ సీజన్‌లోనూ రైతులు పంటలు వేయలేదు. అప్పటి కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని రైతులకు హామీనిచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించినా ఇప్పటివరకు రైతులకు పరిహారంగా ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో పంటనష్టపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐదెకరాల్లో పంట నష్టం పైసా అందలేదు
బట్టి కుంట కింద ఐదెకరాల్లో రెండు బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నాను. భారీ వర్షాలకు బట్టికుంట గండిపడటంతో సాగు చేస్తున్న వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో రబీ సీజన్లో సైతం పంటలు సాగు చేయలేదు. ఏడాది గడుస్తున్నా పైసా ఇవ్వలేదు. వెంటనే పరిహారం చెల్లించాలి.
–మున్నూరి సత్యనారాయణ,
రైతు అల్లాదుర్గం


