● నిందితులను అరెస్టు చేయాలని పలు సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన
● దాడి చేసిన సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గ్రామ సర్పంచ్ తన అనుచరులతో కలిసి దళితులపై దాడిచేసినా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ స్పందించక పోవడం దారుణమని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడిచేసిన గ్రామ సర్పంచ్ మన్నె కల్యాణ్, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితులతోపాటు కేవీపీఎస్, డీబీఎఫ్, ఎంసీఎఫ్, ఏఐఏడబ్ల్యూయూ, సీపీఎం, సీఐటీయూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ...బతుకమ్మ ఉత్సవాల్లో దళితులపై దాడి జరిగి 4 రోజులు అవుతున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్‌ను తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 37 ప్రకారం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని తుప్రాన్ మండలం కిష్టాపూర్, మనోహరబాద్ మండలం కుచారం, శివ్వంపేట్ మండలం నవాబ్ పేట్ గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో దళితులపై దాడులు జరిగియని తెలిపారు. కుచారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్ల వివక్షత పాటించారని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వివేక్ జిల్లాలో దళితులపై దాడి జరిగినా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఎంపీ రఘునందన్ రావుకు దళితులపై జరిగిన దాడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకుంటే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.


