పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం ఆదివారం వేలాది భక్తులతో జనసంద్రంగా మారింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు దుర్గమ్మకు ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఘనపురం ప్రాజెక్టులో వినా యకుల నిమజ్జనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
డీఎంహెచ్‌ఓ గణేశ్వర్
మెదక్ కలెక్టరేట్: కుక్కలు, పిల్లులు పెంచుకునే ప్రజలు రేబిస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గణేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రేబిస్ ప్రమాదకరమైన వైరస్ అని, ఇది నరాల వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. ఒకసారి లక్షణాలు కనిపిస్తే దాదాపు ప్రాణాంతకమేనని చెప్పారు. కొన్ని వారాల నుంచి నెలల వరకు ఈ వైరస్ శరీరంలో నిద్రాణంగా ఉంటుందన్నారు. కుక్క, ఇతర జంతువుల కాట్లను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తక్షణం వైద్యం చేయించుకోవాలని సూచించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు.
తూప్రాన్: ప్రాథమిక విద్య పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, జీఓ 25 సవరణ కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓగార్డెన్‌లో ఎస్జీటీయూ తెలంగాణ రాష్ట్రస్థాయి సమావేశం రాష్ట్ర నిర్వహించారు. ఈసందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీలో ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, వ్యవస్థాపక అధ్యక్షుడు సంకినేని మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, అదనపు కార్యదర్శి పండుగ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని మెప్మా పీడీ హన్మంతరెడ్డి తెలిపారు. ఆదివారం నిరక్షరాస్యులకు మెప్మా ఆధ్వర్యంలో ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 2,500 మందిని నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. వీరికి మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో పాసైన అందరికీ ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.


