● టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి
● జహీరాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం షురూ
జహీరాబాద్: అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు కార్మికుల భవిష్యత్తును నిర్ణయించేవని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎంయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ సంఘాన్ని గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం టీఎంయూ తరఫున గత కొన్నేళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఆర్టీసీ చరిత్రలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎంయూ ఆధ్వర్యంలో 44 శాతం ఫిట్‌మెంట్ సాధించామన్నారు. పోరాటం ఫలితంగానే ప్రజా ప్రభుత్వం చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒప్పుకుందన్నారు. ఆర్టీసీ ఎన్నికల అనంతరం కార్మికుల చిరకాల కోరిక అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేయకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మెదక్ డిపోలో లోక్యాష్ పేరుతో సస్పెండ్ చేసిన కండక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో యూనియన్ ఎన్నికల కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు ఉజ్వల్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, ఎస్‌డబ్ల్యూ కార్యదర్శి వీఎస్‌రావు, డిపో నాయకులు నర్సింహులు, హనుమయ్య పాల్గొన్నారు.


