● ఎంపీ రఘునందన్ రావు
● పర్యాటక చరిత్రను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపు
మెదక్‌జోన్: మెతుకుసీమ పర్యాటకరంగాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు ఎస్పీ విక్రమ్‌కుమార్ సింగ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి సాధించిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లా వెనకబడిందని, కలెక్టర్‌గా ప్రతిమాసింగ్ బాధ్యతలు చేపట్టాక అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందన్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు పోటీగా మెదక్ టూరిజం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల, చర్చి తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా చారిత్రక వారసత్వ, సాంస్కృతిక సంపదను కలిగి ఉందని, దానిని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యాటక సర్క్యూట్లుగా 14 ప్రదేశాలను గుర్తించామన్నారు. టూరిజం అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి మార్గాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం ఖిల్లా సందర్శనకు టూరిజం టికెట్ రూ.20 నిర్ణయించారు. కొనుగోలు చేసిన జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికి కలెక్టర్ టికెట్ అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


