● మిగతా రోజులు కార్యాలయం బంద్
● చర్చనీయాంశంగా లేబర్ ఆఫీసర్ తీరు
● సహాయ కార్మికశాఖ అధికారికి అదనపు బాధ్యతలు
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ పథకాలు కార్మికుల దరిచేరే విషయంలో కార్మికశాఖ కార్యాలయా లు కీలకపాత్ర పోషిస్తాయి. సంక్షేమం, లేబర్ కార్డుల మంజూరు, ఇతర అవసరాల నిమిత్తం కార్మికులు తరచూ కార్యాలయాలకు వస్తుంటారు. ఆశాఖ అధికారి అందుబాటులో ఉంటే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే రామాయంపేటలోని కార్యాలయంలో మాత్రం లేబర్ ఆఫీసర్ వారానికి మూడు రోజులే విధుల్లో ఉంటున్నారు. మిగితా మూడు రోజులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న కార్మికులు ఇబ్బందులపాలవుతున్నారు.
కార్మికులకు తప్పని తిప్పలు
మున్సిపాలిటీ కేంద్రమైన రామాయంపేటలో 45 ఏళ్లుగా కార్మికశాఖ కార్యాలయం కొనసాగుతోంది. దీని పరిధిలో రామాయంపేట, నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని భవన నిర్మాణ, బీడీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చిన్న గదిలో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ సహాయ కార్మిక అధికారి ఖమారొద్దీన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది రెగ్యూలర్ పోస్టు కాగా, నిజామాబాద్ జిల్లాలో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వారానికి ఇక్కడ మూడు రోజలు, అక్కడ మూడు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారంలో మంగళ, శుక్ర, శనివారం మాత్రమే ఆయన అందుబాటులో ఉంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు మంజూరు లేకపోవడంతో మిగితా మూడు రోజులు కార్యాలయం మూసే ఉంటుంది. విషయం తెలియక చాలా మంది కార్మికులు వస్తున్నారు. తాము దూర ప్రాంతం నుంచి వస్తే అధికారి అందుబాటులో లేరని వాపోతున్నారు.
ఇబ్బందుల్లేకుండా చర్యలు
అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నాం. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. రామాయంపేటలో పనిచేస్తున్న అసిస్టెంట్ లేబర్ అఫీసర్‌కు నిజామాబాద్ జిల్లాలో అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఇక్కడ మూడు రోజుల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కొంతమేర ఇబ్బందులు కలుగుతున్నాయి.
– శ్రీనివాస్,
అసిస్టెంట్ కమిషనర్, సిద్దిపేట


