మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఉదయం బ్రేక్‌పాస్ట్‌ను కూడా అందించనుంది. మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో రూ.5కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కింద మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు బ్రేక్‌ఫాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ త్వరలోనే ప్రారంభం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం,హెచ్‌కేఎం ఆధ్వర్యంలో...
ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రభుత్వం హరే కృష్ణ మూమెంట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇందులో రాష్ట్రప్రభుత్వం 60% నిధులిస్తుండగా హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. మెదక్ జిల్లావ్యాప్తంగా 395 పాఠశాలల్లోని 30 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ (ఇడ్లీ, వడ, పూరీ, దోశ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ) అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రస్తుతం జిల్లాలో గత రెండు రోజుల నుంచి ట్రయల్‌రన్ కొనసాగుతోంది. త్వరలోనే జిల్లాలో అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
నాణ్యమైన పౌష్టికాహారం:
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పోషకాలతో కూడిన రోజుకో తీరు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని, తద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికమైన అల్పాహారం కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే త్వరలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు–603, ప్రాథమికోన్నత పాఠశాలలు–128, ఉన్నత పాఠశాలలు–155, అర్బన్ రెసిడెన్సియల్ పాఠశాలలు–1, ప్రభుత్వ జూనియర్ కళాశాలు 16 ఉన్నాయి. అయితే ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేకంగా గుర్తించిన 395 పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు సన్నద్ధమవుతోంది.
వేగంగా సాగుతున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పనులు
జిల్లాలో 395 ప్రభుత్వ పాఠశాలల్లో..
30వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
పనులు పరిశీలించిన కలెక్టర్
పనులు పరిశీలించిన కలెక్టర్
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈఓ రాజు సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


