మూడేళ్లుగా ఆవిష్కరణకు నోచుకోని అంబేడ్కర్ విగ్రహం
మెదక్ కలెక్టరేట్: అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన అంబేడ్కర్ విగ్రహం తిరిగి ఆవిష్కరణకు నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రం ఏర్పాటైన అనంతరం ప్రభుత్వం పట్టణ ప్రధాన రోడ్డు విస్తరణ చేపట్టింది. ఈసందర్భంగా రాందాస్ చౌరస్తాలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను తొలగించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. రోడ్డు అభివృద్ధి పూర్తయ్యక శివాజీ విగ్రహాన్ని అభిమానులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అలాగే వైశ్యులంతా ఏకమై మహాత్మగాంధీ విగ్రహాన్ని సొంతంగా ఏర్పాటు చేశారు. అయితే అంబేడ్కర్ విగ్రహాన్ని మాత్రం అధికారులు విస్మరించారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టగా, ఎట్టకేలకు రాందాస్ చౌరస్తాలో ఒక పక్కన రోడ్డు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి అసంపూర్తిగా వదిలేశారు. మూడేళ్ల క్రితం ముసుగుతో ఏర్పాటు చేసినా, ఇప్పటివరకు ఆవిష్కరణకు నోచుకోలేదు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్ కోరారు.


